బీసీ సంక్షేమానికి రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి – గుజ్జసత్యం జాతీయఉపాధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం.

హైదరాబాద్, మార్చి 11 (సత్య తెలంగాణ): వచ్చే బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరంకు బీసీ బడ్జెట్ను రూ.20వేల కోట్లకు పెంచాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు రూ.38 వేల కోట్ల బడ్జెట్ కేటాయించారని ఆయన పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్కు సబ్సిడీ రుణాల కోసం రూ.4వేల కోట్లు ఎంబీసీ కార్పొరేషన్కు రూ.2వేల కోట్లు, బీసీ కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తి ప్రకారం ఒక్కొక్క ఫెడరేషన్కు రూ.2వేల కోట్లు కేటాయించాలన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును కాంగ్రెస్ ఎన్నికల మెనిఫెస్టో ప్రకారం పునరుద్దరించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అదనంగాప్రతి అసెంబ్లీ నియోజకవర్గంకు ఒక బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతమున్న 290 బీసీ గురుకుల పాఠశాలలన్నీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, అద్దె భవనాల్లో సరైన వసతి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో ఆశించిన విద్యా ప్రమాణాలు, లక్ష్యాలు నెరవేరడం లేదని ఆయన పేర్కొన్నారు. గురుకులాలకు సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 80శాతం నిధులు భవనాల నిర్మాణం కోసం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. దశలవారిగా గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణం చేయడానికి రాష్ట్ర బడ్జెట్లో 20శాతం కింద రూ.400 కోట్లు బడ్జెట్ కేటాయించాలన్నారు. మిగతా 80శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలని ఆయన కోరారు. బడ్జెట్లో నిధులను కేటాయించడంలో బీసీను నిర్లక్ష్యం చేస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ నేతలు నీల వెంకటేష్, టి. నందకుమార్, వేముల రామకృష్ణ, సూర్యనారాయణ, మణికంఠ, ఉదయ్, మట్ట జయంతి తదితరులు పాల్గొన్నారు.