బిసి రిజర్వేషన్లపై బిజెపి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్

హైదరాబాద్ (సత్య తెలంగాణ): బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఢీల్లీలో బిసి రిజర్వేషన్లపై చేసిన వాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలకు 42శాతం రిజర్వే షన్ల అమలుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు న్యాయపరమైన అంశాలపై అవగాహన లేదని, పూర్తి అజ్ఞానంతో వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం సా ధ్యం కాదనుకున్నప్పుడు అసెంబ్లీ బిజెపి శాసన సభ్యులు బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చారు..? ఎందుకు యుటర్న్ తీసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో బిజెపికి బిసిల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎంటో తెలిసిపోయింది అన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల లిస్టులో కేంద్రంలోని ఓబీసీల జాబితాలో ముస్లింలు ఉన్నారు కదా, ఈ అంశంపై బీజేపీ ఎందుకు మాట్లాడదు అని ఆయన ప్రశ్నించారు.
తమిళనాడులో 1994 నుంచి 69% రిజర్వేషన్లు అమలవుతున్న విషయం బిజెపి ప్రభుత్వానికి తెలియదా అని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే తెలంగాణలోని బీసీలంతా ఏకమై బీసీ వ్యతిరేక పార్టీలను భూస్థాపితం చేస్తామని అన్నారు.