తెలంగాణ బీసీ బిల్లుకు అఖిలపక్ష మద్దతు కోసం భవిష్యత్ కార్యాచరణ – రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని చేసిన తీర్మానం పార్లమెంటులో ఆమోదం పొందేలా భవిష్యత్ కార్యాచరణ కోసం ఈరోజు కాచిగూడ లోని అభినందన్ గ్రాండ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య గారు మాట్లాడుతూ తెలంగాణ బీసీ రిజర్వేషన్ లో స్థానిక సంస్థల్లో బి.సి.లకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లలో 42 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు ఇది బీసీల సమిష్టి పోరాట కృషి ఫలితం అని అన్నారు.. అలాగే ఈ బిసి బిల్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి దీని షెడ్యూల్ 9 లో పొందుపరిస్తే తప్ప న్యాయపరమైన ఇబ్బందులు కాకుండా ఉంటుందని నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేంత వరకు అక్కడి నుండే తెలంగాణ పరిపాలన మొదలు పెట్టాలని అన్నారు. దీనికి ఉదాహరణగా జయలలిత గతంలో తమిళనాడు బీసీల కొరకు తమిళనాడు నుండి అఖిలపక్షాన్ని తీసుకొని వచ్చి ఢిల్లీలోనే ఉండి ఇక్కడ బిల్లు పాస్ అయ్యేంతవరకు తమిళనాడు బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేంతవరకు ఇక్కడే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ చట్టం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు, ఇదే సమయంలో ఈ బిల్లు కు బేషరతుగా మద్దతు తెలిపిన బిఆర్ ఎస్, బీజీపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీల నేతలకు సమస్త బీసీ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం చట్టసభలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, విద్య, ఉద్యోగాలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని అన్నారు. జాతీయ స్థాయిలో ఓబీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యుస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.