బీసీ బిల్లుపై అసలు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఉద్దేశం ఏమిటి? బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం.. బీసీ మేధావులూ ఆలోచించండి..

హైదరాబాద్,ఎప్రిల్ 02 (సత్య తెలంగాణ): తెలంగాణ లో 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున న్యాయ నిపుణులతో లోతుగా చర్చించి అమలు కోసం పగడ్బంధీగా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. బుధవారం కాచిగూడ అభినందన్ గ్రాండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, రాజకీయ రిజర్వేషన్ల కోసం మరోక బిల్లు ఉందని, ఈ రెండు బిల్లులను కేంద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదన్నారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల కోసం నిర్ణయించే అధికారం రాజ్యంలోని 246 డి6 ప్రకారం రాష్ట్రానికి ఇచ్చారని తెలిపారు. జనాభా లెక్కలు అసెంబ్లీ బిల్లు ఉన్నందున రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని, వెంటనే అమలు చేయవచ్చని తెలిపారు. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగ సవరణ అవకాశం పడవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇలా రెండు బిల్లులపై భిన్నాభిప్రాయాలు ఉన్నందున దీనిపై నిపుణులతో చర్చించాలని ఆయన కోరారు. బీహార్, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధాన ప్రక్రీయను ఇక్కడ కూడా పాటించాలని ఆయన సూచించారు. తమిళనాడు లో రిజర్వేషన్లు పెంచినప్పుడు బిల్లులు పాస్ చేయడానికి చట్టాలు చేసినప్పుడు మొదట జీవోలు జారీ చేసి ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు. తర్వాత కొందరు కోర్టుకు పోయినప్పుడు సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టవేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి పెంచి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి సవరణ చేసిందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఇంతవరకు గవర్నర్ ఆమోదం పొందలేదని, దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేయలేదని, మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రానికి పంపకుండానే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని చెప్పడం, కేంద్రంపై చలో ఢిల్లీ కార్యక్రమాలు పెట్టడం అనేది బీసీలను మోసం చేయడమే. అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల సంక్షేమానికి ఉపయోగపడే బీసీ రిజర్వేషన్ బిల్లుని ఆమోదించాలని, అమల్లోకి వచ్చేటట్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు నీలం వెంకటేష్, వేముల రామకృష్ణ, జిల్లాపెల్లి అంజి, భాగ్యలక్ష్మి, జెల్ల నరేందర్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.