బీసీ బందుకు మద్దతు అంటూనే అక్రమ కేసులా? గుజ్జ సత్యం

హైదరాబాద్, సత్య తెలంగాణ:
బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా రాష్ట్ర బంద్ విజయవంతంగా ముగిసిందని, అయితే ప్రభుత్వం ఈ విజయాన్ని తట్టుకోలేక ఉద్యమకారులపై అక్రమ కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం విమర్శించారు.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంస్థలు, కార్మిక సంఘాలు విశేష మద్దతు తెలిపి బంద్‌ను విజయవంతం చేశాయని పేర్కొన్నారు. ఈ బంద్ బీసీ సమాజం ఏకతా శక్తిని చాటిచెప్పిందని అన్నారు.అయితే, ఈ ప్రజా మద్దతు చూసి ప్రభుత్వం భయపడి ఉద్యమకారులపై అక్రమ కేసులు, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన ఖండించారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమవుతాయని, బీసీ రిజర్వేషన్ బిల్ ఆమోదించేంత వరకు పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని రెండున్నర కోట్లకు పైగా బీసీలు ఏకమై ముందుకు వస్తే మన న్యాయబద్ధమైన హక్కులు సాధించడం ఎంతో దూరం లేదని గుజ్జ సత్యం స్పష్టం చేశారు. అన్ని పక్షాలు, ప్రజా సంఘాలు కలిసి బీసీ రిజర్వేషన్ బిల్ సాధన కోసం ఒకే వేదికపై పోరాటాన్ని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.