ఈ రహస్యం తెలిస్తే ఎంత కష్టమైనా చన్నీటి స్నానమే చేస్తారు..
చన్నీళ్ల స్నానం రహస్యం తెలిస్తే ఎంత కష్టమైనా చన్నీటి స్నానమే చేస్తారు..
మనలో చాలా మందికి చన్నీళ్ళ స్నానం అంటేనే ఒణుకు పుడుతుంది. ప్రధానంగా చలికాలంలో ప్రతి ఒక్కరికి వేడినీళ్ల స్నానానికి ప్రాధాన్యమిస్తారు. అయితే, వేడినీళ్ల కంటే చన్నీళ్ళ స్నానంతోనే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నట్లు హైడ్రోథెరపి వైద్యులు చెబుతున్నారు.
పురాతన కాలంలో నీటితో వైద్యం అంటే హైడ్రోథెరపిని వైద్యులు మందులకు బదులుగా రోగాలు నయం చేయడానికి ఉపయోగించేవారు. ఈ పద్ధతిలో చల్లని నీటిని వాడేవారు. ఈ నేపథ్యంలోనే నేడు అనేక “స్పా”లు సైతం చన్నీటినే వాడుతున్నారు. క్రమం తప్పకుండ నిత్యం చన్నీటితో స్నానం చేస్తే అనేక అనారోగ్యాలకు దూరం కావచ్చు.
చన్నీటి స్నానం ఒత్తిడి, డిప్రెషన్ తదితర సమస్యలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యం చక్కబడుతుంది. చర్మ కాంతి పెరిగి యుక్త వయస్సు ఉన్నవారిలా కనిపిస్తారు. శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజు చన్నీటి స్నానం చేస్తే రోగాలతో పోరాడే తెల్లరక్త కణాల సంఖ్య పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మెటబాలిజం ప్రక్రియ కూడా వేగం పుంజుకుంటుంది. చర్మం నుంచి హానికరమైన రసాయనాలు తొలిగిపోతాయి.
వేడి నీరు చర్మ రంధ్రాలను తెరిస్తే.. దానికి వ్యతిరేకంగా చల్లని నీరు పనిచేస్తుంది. చర్మ రంధ్రాలు మూసుకుంటే అక్కడ మురికి పేరుకోదు. చర్మం శుభ్రంగా ఉంటుంది. మొటిమలు వంటివి రావు. చన్నీటి స్నానం వెంట్రుకలను నల్లగా చేసి వాటికి మెరిసే గుణం ఇస్తుంది. జుట్టు రాలకుండా చేస్తుంది. చుండ్రు రాకుండా చేస్తుంది. ఎండ్రోకిన్ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది. దీంతో హార్మోన్లు సరిగ్గా తయారవుతాయి. పురుషులు వేడి నీటి స్నానం చేస్తే వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. చన్నీటి స్నానం శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. రోజంతా మనసుకు ప్రశాంతత, ఆహ్లాదం లభిస్తుంది.