NewsPolitics

బీసీలకు రాజకీయ శక్తి సాధనకు ‘బీసీ జన భోజనం’ మార్గం.

హైదరాబాద్, డిసెంబరు 28 (ప్రతినిధి): బీసీ సమాజానికి రాజకీయ అధికారం సాధించేందుకు దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటానికి ‘బీసీ జన భోజనం’ కార్యక్రమం బలమైన బాటలు వేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. ఎల్బీ నగర్‌లోని ఆటోనగర్‌లో ఆదివారం బీసీ జన భోజనాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీసీ జన భోజన మహోత్సవం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా బీసీ సమాజంలో ఐక్యతను పెంపొందించి, రాజకీయ సాధికారతకు మార్గం సుగమం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

కార్యక్రమానికి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కో-ఆర్డినేటర్ గుజ్జ సత్యం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ, గతంలో బీసీ సమాజం ఎదుర్కొన్న సామాజిక, ఆర్థిక వివక్షలపై నిర్వహించిన ఉద్యమాలను గుర్తు చేశారు. “మన సమాజం దశాబ్దాలుగా విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో అన్యాయానికి గురవుతోంది. గతంలో మనం బీసీ రిజర్వేషన్ల  అంశాలపై బలమైన పోరాటాలు నిర్వహించి కొన్ని విజయాలు సాధించాం. కానీ, రాజకీయ అధికారం లేకుండా ఈ సాధికారత అసంపూర్ణమే. ఇప్పుడు ‘జన భోజనం’ వంటి కార్యక్రమాల ద్వారా మన సమాజ సభ్యులు ఒకే వేదికపై కలిసి చర్చించి, ఐక్యతను ప్రదర్శించడం ద్వారా రాజకీయ పార్టీలకు మన బలాన్ని చూపించాలి. బీసీలు సంఘటితమైతే, మనకు రాజకీయంగా గుర్తింపు లభించడమే కాకుండా, మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో సరైన ప్రాతినిధ్యం వస్తుంది. ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసి, రాజ్యాధికార సాధన వరకు ఆగకుండా ముందుకు సాగాలి. అన్ని బీసీ ఉపకులాలు ఐక్యంగా కదలిరావాలి – ఇది మన భవిష్యత్తును మార్చే కీలక అడుగు” అని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం ను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో కమిటీ సలహాదారు ఈశ్వరమ్మయాదవ్, గౌరవ సలహాదారులు వెంకటేష్ గౌడ్, వేములయ్య గౌడ్, సభ్యులు బొమ్మ రఘురాం నేత, చామకూర రాజు, విశ్వనాథుల పుష్పగిరి తదితరులు పాల్గొన్నారు. వివిధ బీసీ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ మహోత్సవం బీసీ సమాజంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నిర్వాహకులు తెలిపారు.