రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలి- గుజ్జ సత్యం

హైదరాబాద్, అక్టోబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని , రాష్ట్రంలోని అఖిలపక్షాల తరఫున బీసీ సంఘాల ప్రజాసంఘాల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలిసేలా చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేసి, బీసీ రిజర్వేషన్లను భారత రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన కోరారు.
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 27న జారీ చేసిన జీవో నెం.9 ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 67%కు చేరుకుంటాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటి కాగా అయితే, ఈ జీవోపై తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 9న తాత్కాలిక స్టే విధించింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, 50% రిజర్వేషన్ పరిమితిని మించి ఈ నిర్ణయం తీసుకున్నామని, కుల గణన ఆధారంగా ఇది జరిగిందని వాదించింది.
ఈ నేపథ్యంలో మాట్లాడుతూ గుజ్జ సత్యం, “తెలంగాణలో బీసీ సముదాయాలు దశాబ్దాలుగా సామాజిక, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా వారికి న్యాయం జరగాలి. కానీ, న్యాయపరమైన అడ్డంకులు వస్తున్నాయి. దీనికి పరిష్కారం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి, ఈ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడమే. ఇది న్యాయపరమైన సవాళ్ల నుంచి రక్షణ కల్పిస్తుంది” అని పేర్కొన్నారు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా చట్టాలు న్యాయపరమైన పరీక్షకు గురికాకుండా ఉంటాయని, 2007లో సుప్రీంకోర్టు ఐఆర్ కొయెల్హో కేసులో ఇచ్చిన తీర్పు దీన్ని స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమం లో వెంకన్న , జెల్ల నరేందర్ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మరపంగు వెంకన్న కర్నాటి లోకేష్ గారు డేగల రమ ముషీరాబాద్ బీసీ సంగం జనరల్ సెక్రటరీ,తదితరులు పాల్గొన్నారు

