NewsPolitics

పూలే దంపతుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి – బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

హైదరాబాద్, ఏప్రిల్ 09(సత్య తెలంగాణ): మహిళలకు సమానత్వం కోసం, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తులు జ్యోతిరావు పూలే, సావిత్రబాయి పూలే అని, అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర భావితరాలకు అందించడానికి పూలే దంపతుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కాచిగూడలో బీసీ సంఘాల ప్రతినిధుల కోర్ కమిటీ సమావేశం గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల 150 అడుగుల విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గురువుగా భావించే పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశంలో విద్యా విప్లవం తీసుకువచ్చన గొప్ప సంఘ సంస్కర్త పూలే దంపతులని ఆయన కొనియాడారు. ఏప్రిల్ 11న పూలే జయంతి వేడుకల్లో పూలే దంపతుల విగ్రహా ఏర్పాటు పై సీఎం ప్రకటన చేయాలని, లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ సంఘటితంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు నీలం వెంకటేష్, జిల్లాపెల్లి అంజి, జెల్ల నరేందర్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.