బీసీలలో వస్తున్న రాజకీయ చైతన్యానికి ఎమ్మెల్సీ ఎన్నికలు నిదర్శనం – గుజ్జ సత్యం

హైదరాబాద్, మార్చి 05 (సత్య తెలంగాణ): బీసీలలో వస్తున్న రాజకీయ చైతన్యానికి ఎమ్మెల్సీ ఎన్నికలు నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ తో కలిసి గుజ్జ సత్యం మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు బీసీల చైతన్యానికి స్ఫూర్తిగా ఉన్నాయని అన్నారు. బీసీలు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చుననేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తాయన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన గెలువ లేని పరిస్థితిలో ఉన్నాయని తెలిపారు. బిసి అభ్యర్థులు గెల్పొందే అవకాశం ఉందన్నారు. కొన్నిచోట్ల ఇద్దరు ముగ్గురు బీసీ అభ్యర్థులు పోటీ చేయడం వల్లే బీసీ అభ్యర్థులకు ఓటమి జరిగిన బిసి వాదం మాత్రం గెలుపొందిందని ఆయన పేర్కొన్నారు పట్టభద్రులు, టీచర్స్ లో చాలా చైతన్యం వచ్చిందన్నారు. మనం ఇదే స్ఫూర్తితో ముందుకు వెళితే రాజ్యాధికారం సాధించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఇది ఏ ఒక్కరోజులోనో సాధ్యమయ్యే పని కాదని ఆయన పేర్కొన్నారు. 3000 సంవత్సరాలుగా బీసీలను అణగదొక్కుతూనే ఉన్నారని తెలిపారు. బీసీలపై కొనసాగుతున్న అణిచివేత పీడనను బీసీల ఐక్యమత్యంతో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణను సాధించుకోవడానికి 17 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చిందని అదే స్ఫూర్తితో రాజ్యాధికారం సాధించుకోవడానికి బీసీలు ఉద్యమించాలని అన్నారు. మనం ఎంతో మనకంత వాటాను సాధించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదేవిధంగా అందరం కలిసికట్టుగా ముందుకు వెళితే సాధించలేనిది అంటూ ఏమీ లేదని ఆయన తెలిపారు. గ్రామస్థాయి నుంచి ప్రణాళిక బద్ధంగా బీసీ వాదాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా బీసీ నేతలు కృషి చేయాలని ఆయన కోరారు.