మంత్రి కేటీఆర్‌కు మరో షాక్… ఈసారి సింగర్ సునీత
మంత్రి కేటీఆర్‌కు మరో షాక్… ఈసారి సింగర్ సునీత
తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కే తారకరామారావుకు సోషల్ మీడియా చుక్కలు చూపిస్తోంది. అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌కు రావడం ఏమో కానీ మంత్రి కేటీఆర్ మాత్రం రోజుకో సవాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవాంకా ట్రంప్ కోసం హైదరాబాద్‌లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లన్నింటినీ(అన్నీ అంటే అవసరమైనవి అని అర్థం చేసుకోవాలి) అద్దంలా తీర్చి దిద్దుతున్నారు. నగరంలో బిచ్చగాళ్లు లేకుండా తరలించేశారు. ఫుట్‌పాత్‌లు, ఫ్లైవొవర్లు… ఇతర బహిరంగ ప్రదేశాలన్నింటికి తళుకులద్దుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు… హైదరాబాద్‌కు మెరుగులు దిద్దుతున్న పనులకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ స్పందనను బట్టి నగరం రెండుగా విడిపోయిందని తెలుస్తోంది. ఇందులో ఒకటి ఇంవాకా కాలుమోపే ప్రాంతం కాగా, మరొకటి ఆమె నీడ కూడా పడని ప్రాంతం. ఇలా ఎందుకు పోల్చాలి అంటే… ఇవాంకా తిరిగే మార్గంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం రెండో వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణం అవుతోంది.
తాజాగా పాపులర్ సింగర్ సునీత కూడా గళం విప్పారు. హైదరాబాద్‌కు మెరుగులు దిద్దడంపై తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలతో ఒక పోస్టు పెట్టారు. ‘‘ట్రంప్ కూతురు ఇవాంక రాయదుర్గం- ఖాజాగూడ రోడ్డు గుండా రావడం లేదేమో? వస్తే బావుండు’’ అంటూ సునీత తన ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. హైదరాబాద్‌లో ఇవాంక పర్యటించే ప్రాంతాలన్నీ కొత్త కళను సంతరించుకుంటున్నాయి. ఐటీ కారిడార్, పాతబస్తీలోని రోడ్లన్నీ తళతళ మెరుస్తుంటే, ఇరువైపులా పెయింటింగ్‌లు, పచ్చదనంతో ఆ ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. ఈ అభివృద్ధి పనులు, సొబగులు అన్నీ ఇవాంక ప్రయాణించే మార్గాలకే పరిమితమా? అన్నట్టుగా సునీత చేసిన కామెంట్‌పై నెటిజెన్లు విశేషంగా స్పందిస్తున్నారు. సునీత చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఇక, సునీత కంటే ముందే ఇదే విషయమై పలువురు నెటిజన్లు కూడా స్పందించారు. ప్రజలు ఇన్నాళ్లుగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఇవాళ ఇవాంకా కోసం ఇలా రోడ్లు బాగు చేయడం ఏమిటంటూ మండిపడ్డారు.
ఇలా ప్రజలు చేస్తున్న కామెంట్లన్నీ నేరుగా పురపాలక శాఖ, ఐటీ శాఖల మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు తగులుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ప్రశ్నలకు బదులిచ్చుకోవాల్సి వస్తోంది. ఇవాంకా పర్యటన కోసం తెలంగాణ ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు పెడుతుందని ఒక ప్రచారం ఉంది. ఈ మొత్తంలో 90 శాతం హైదరాబాద్‌ను అందంగా చూపించడానికే వెచ్చిస్తున్నట్లు సమాచారం. రోడ్ల అభివృద్ధి… మరమ్మత్తుల కోసమే దాదాపు ఓ 60 కోట్ల వరకూ ఖర్చు పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతో రెండు రోజులుండి వెళ్లిపోయే ఇవాంకా కోసం ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారంటూ ప్రభుత్వంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో నగర రోడ్లన్నీ జలమయం అవ్వడంతో నగరప్రజలు పడిన పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది ప్రజలన్ని పట్టించుకోకుండా ఇవాంకా కోసం వంద కోట్ల రూపాయలు వెచ్చించడం ఏమిటంటూ నిలదీతలు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఇవాంకా వస్తోందని ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదని, రోడ్లను బాగు చేస్తోంది అమె కోసమే అనడంలో అర్థం లేదని సర్ధి చెప్పుకున్నారు. నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్నీ దెబ్బతిన్నాయని అందుకే వాటిని త్వరితగతిన మరమ్మతులు చేస్తున్నామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే, కేటీఆర్ సమాధానం పట్ల జనం సంతృప్తి పడలేదు. జనం కోసం రోడ్లకు మరమ్మతులు చేస్తుంటే… ఆ పనులన్నీ ఇవాంకా పర్యటించే మార్గంలోనే ఇవాంకా తిరిగే ప్రాంతాలకే ఎందుకు కేంద్రీకృతం అవుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. నగరమంతా రోడ్లన్నీ పాడైపోతే వాటన్నింటిని ఎందుకు బాగు చేయడం లేదని నిలదీస్తున్నారు.
ఇప్పుడు సింగర్ సునీత పెట్టిన పోస్టుతో మరోసారి ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇవాంకా తిరిగే మార్గంలోనే రోడ్లు అద్దంలా చేస్తున్నారని తమ ప్రాంతానికి ఇవాంకా వస్తే బావుంటుందన్న రీతిలో ఆమె పోస్టు ఉండడం అది అత్యంత వేగంగా వైరల్ అవుతుండడంతో మంత్రి కేటీఆర్ ఇరాకాటంలో పడ్డారు. పురపాలక శాఖ మంత్రిగా దీనిపై స్పందించాల్సింది ఆయనే కావడమే ఇందుకు కారణం. అలా కాకున్నా తెలంగాణ ప్రభుత్వం తరఫున సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండేది కూడా కేటీఆర్ ఒక్కరే. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎదుర్కోవాల్సింది కూడా ఆయనే.