పద్మశాలీలకు రాజకీయ చైతన్యం అవసరం – బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

అఖిలభారత పద్మశాలీ మహాసభలో మాట్లాడుతున్న
గుజ్జ సత్యం
హైదరాబాద్.మార్చి 09 (సత్య తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న పద్మశాలీ సామాజిక వర్గం వ్యాపార వ్యవహారాల్లో, ఉద్యోగాల్లో వివిధ రంగాల్లో ముందుకు వెళ్తున్నా రాజకీయ చైతన్యం లేకపోవడంతో రాజ్యాధికారంలో వెనుకబడిపోతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పద్మశాలి అన్నారు. పద్మశాలీ మహాసభల సందర్భంగా ఆదివారం నారాయణగూడ లోని పద్మశాలి భవన్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సభావేదిక వరకు అఖిల భారత పద్మశాలి మహాసభజాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ తెలంగాణలో జనాభాలో అధిక సంఖ్యలో ఉన్నా.. 20 నియోజకవర్గాలకు పైగా విస్తరించి ఉన్నా.. 10 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాషించే స్థాయిలో ఉన్నా నేడు ఒక్క పద్మశాలి ఎమ్మెల్యేకూడా లేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. మనం ఏజాతి చూసినా, ఏ చరిత్ర చూసినా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నా ఏ కులం అయినా, ఏ కూటమి అయినా క్రమక్రమంగా మరుగున పడే ప్రమాదం ఉందన్నారు. రాజకీయ చైతన్యంతోనే రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళినప్పుడే చరిత్రలో నిలిచిపోగలుగుతామని అన్నారు. పద్మశాలీలు రాజకీయాలకు అతీతంగా ఉండి మన నేతలను మనం అసెంబ్లీకి, పార్లమెంట్కు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పద్మశాలీలు ఎక్కడ ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేసిన రోజే పద్మశాలీల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా పద్మశాలీలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనం దుశ్యంతల, ఇంజినీర్స్ విభాగం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పుట్ట పాండురంగయ్య. తెలంగాణ ప్రాంత మహిళా అధ్యక్షురాలు గుంటక రూపా సదాశివ్, గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు పోరండ్ల శారధ తదితరులు పాల్గొన్నారు.